Palak Pulao : మనం పాలకూరను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనం పాలకూరను ఉపయోగించి పాలకూర పప్పు, పాలకూర రైస్, పాలక్ పన్నీర్ వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూరతో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – పావు కిలో, నానబెట్టిన బియ్యం – 2 కప్పులు, పచ్చి మిర్చి – 4, అల్లం ముక్కలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), వెల్లుల్లి రెబ్బలు -4, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు -3, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 2, దాల్చిన చెక్క – 2, మిరియాలు – అర టీ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), క్యారెట్ తురుము – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – ఒక కప్పు, గరం మసాలా -పావు టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – రుచికి సరిపడా.
పాలక్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి కాగాక లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. తరువాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చి మిర్చి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఆ తరువాత క్యారెట్ తురుము, తరిగిన పాలకూర వేసి వేయించుకోవాలి. పాలకూర పూర్తిగా ఉడికిన తరువాత నానబెట్టిన బియ్యం, తరిగిన కొత్తిమీర, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లను, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించి, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ పులావ్ తయారవుతుంది. దీన్ని సాధారణ బియ్యంతోపాటు బాస్మతి బియ్యంతోనూ తయారు చేయవచ్చు. పాలక్ పులావ్ ను నేరుగా లేదా రైతాతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
పాలకూరను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ అజీర్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధశక శక్తిని పెంచడంలో కూడా పాలకూర ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని తరచూ ఇలా చేసి తినవచ్చు. దీంతో రుచితోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా మీ సొంతమవుతాయి.