Pani Puri : పానీపూరీ అంటే తెలియని వారుండరు. వీటిని గోల్ గప్పా, పుచ్కా వంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటాయి. పానీపూరీని అందరూ చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బయట దొరికే వాటిలా ఇంట్లో కూడా చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పానీపూరీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో, వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పానీపూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక కప్పు, మైదా పిండి – ఒక కప్పు, నూనె – సరిపడా, నీళ్లు – తగినన్ని.
మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించి ముక్కలుగా చేసిన బంగాళా దుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), ఉడికించిన బఠాని – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – రుచికి సరిపడా, ఉప్పు – రుచికి సరిపడా, ధనియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
పానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – ఒక కప్పు, తరిగిన పుదీనా – ఒక కప్పు, చింతపండు – 30 గ్రా., అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – 1, నీళ్లు – 2 గ్లాసులు, కారం – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్.
పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉప్మా రవ్వ, మైదా పిండి వేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత నీటితో తడిపిన వస్త్రాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిపై వేసి 30 నిమిషాల పాటు కదలించకుండా ఉంచాలి. తరువాత పిండిని ఒకసారి కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ముద్దలన్నింటిపై వచ్చేలా రెండు టీ స్పూన్ల నూనెను వేయాలి. తరువాత ఎటువంటి పొడి పిండిని, నూనెను వాడకుండా మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా వత్తుకున్న వాటిని ఒక పాలీథిన్ కవర్ పై ఉంచి నీటితో తడిపిన వస్త్రాన్ని వీటిపై ఉంచాలి. తరువాత కళాయిలో డీప్ ఫ్రై కు సరిపడా నూనె వేసి కాగాక మధ్యస్థ మంటపై పూరీలను కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు కరకరలాడుతూ ఉంటాయి.
మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీల నుండి సగం బఠానీలను తీసుకుని ఒక జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలు వేసి కలిపి టమాటా ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలుపుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, బఠానీలతోపాటు మెత్తగా మిక్సీ పట్టుకున్న బఠానీల మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత చాట్ మసాలా, గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా కూర తయారవుతుంది.
పానీ తయారీ విధానం..
ముందుగా చింతపండును నానబెట్టి చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో తరిగిన కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చి మిర్చి, కొద్దిగా చింతపండు రసం వేసి పేస్ట్ లా పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను పోసి ముందుగా పేస్ట్ లా పట్టుకున్న మిశ్రమంతోపాటు మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పానీ తయారవుతుంది.
పూరీలో మసాలా కూరను పెట్టి, పానీని పోసి తింటే చాలా రుచిగా ఉంటుంది. బయట తయారు చేసే పానీపూరీని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.