Pulihora : మనం వంటింట్లో చింతపండును ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. చింతపండును ఉపయోగించి చేసే వాటిల్లో చింతపండు పులిహోర కూడా ఒకటి. చింతపండు పులిహోరను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చింతపండు పులిహోర కూడా ఒకటి. చాలా సులువుగా, రుచిగా చింతపండు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – పావు కిలో బియ్యంతో వండింత, చింతపండు గుజ్జు – 50 గ్రాములు, బెల్లం తురుము – ఒక టీస్పూన్, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 5, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – పావు టీ స్పూన్.
చింతపండు పులిహోర తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పొడిగా అయ్యేలా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో చింతపండు గుజ్జును, అర టేబుల్ స్పూన్ నూనెను, పావు టీ స్పూన్ పసుపును, ఒక టీ స్పూన్ ఉప్పును వేసి కలిపాలి. ఈ చింతపండు గుజ్జులో నీరు అంతా పోయి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పల్లీలను, శనగ పప్పును, మినప పప్పును, ఆవాలను, ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం ముక్కలను, పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత కరివేపాకును వేసి వేయించుకోవాలి.
తరువాత ముందుగా ఉడికించిన చింతపండు గుజ్జు నుండి కొద్దిగా తీసి పక్కన పెట్టుకుని మిగిలిన చింతపండు గుజ్జును వేయాలి. ఇందులోనే పసుపును కూడా వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత ఇంగువను వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లగా అయిన తరువాత ఆరబెట్టుకున్న అన్నాన్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును కూడా వేసి కలపాలి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కలుపుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పులిహోరను ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పులిహోరను అందరూ ఇష్టంగా తింటారు. వంటరాని వారు కూడా ఇలా చాలా సులువుగా చింతపండు పులిహోరను తయారు చేసుకోవచ్చు.