Tomato Sauce : సాధారణంగా మనం బేకరీల నుంచి ఏవైనా ఆహారాలను తినేందుకు తెచ్చుకున్నప్పుడు లేదా అక్కడే ఏవైనా ఫుడ్ ఐటమ్స్‌ను తిన్నప్పుడు మనకు టమాటా సాస్ ఇస్తుంటారు. అలాగే రెస్టారెంట్స్‌లో తందూరి ఐటమ్స్‌ను తినేందుకు కూడా మనకు టమాటా సాస్ ఇస్తుంటారు. అయితే మనం ఇంట్లో ఈ ఆహారాలను చేసుకుంటే ఎలా.. టమాటా సాస్ ఉండదు కదా.. అని చెప్పి బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎంతో సులభంగా టమాటా సాస్‌ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా సాస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – రెండున్నర కిలోలు, ఎండు మిర్చి – 7, వెల్లుల్లి – 3, అల్లం – రెండు ముక్కలు, ఎండు ద్రాక్ష – సగం కప్పు, వైట్ వెనిగర్ – సగం కప్పు, ఉప్పు – ఒక టీస్పూన్, చక్కెర – ఆరు టీస్పూన్లు, సోడియం – బెంజోయేట్ – ఒక టీస్పూన్ (వేడి నీటిలో పావు టీస్పూన్ వేసి కలిపింది).
టమాటా సాస్‌ను తయారు చేసే విధానం..
టమాటాలను కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎండు మిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్‌లో టమాటా ముక్కలు వేసి అల్లం, వెల్లుల్లి, మిర్చి, వెనిగర్, ఉప్పు, చక్కెర కలిపి సన్నని మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు మెత్తగా అవగానే స్టవ్‌ను ఆఫ్ చేయాలి. బ్లెండర్‌తో టమాటా స్మూతీ చేయాలి. దీన్నంతా వడకట్టాలి. సన్నని మంటపై టమాటా గుజ్జునంతా దగ్గరకి వచ్చేంత వరకు ఉడికిస్తే టమాటా సాస్ రెడీ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే సోడియం బెంజోయేట్ కలపాలి. చల్లారాక సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెడితే చాలు. ఇలా తయారు చేసుకున్న టమాటా సాస్ 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఇంట్లో ఏవైనా బేకరీ, తందూరి ఐటమ్స్‌ను తయారు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. లేదా బయటి నుంచి ఆయా ఆహారాలను తెచ్చుకున్నప్పుడు కూడా ఈ సాస్‌ను ఉపయోగించి వాటిని తినవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా ఎంతో సులభంగా టమాటా సాస్‌ను తయారు చేసుకోవచ్చు.