Pumpkin Seeds : గుమ్మడికాయలు మనకు ఎప్పుడు కావాలన్నా లభిస్తాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటలు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. గుమ్మడికాయల తీపి వంటకాలు భలే రుచిగా ఉంటాయి. అయితే గుమ్మడికాయలు మాత్రమే కాదు.. వాటి విత్తనాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజుకు ఎంత పరిమాణంలో తినాలి ? ఎప్పుడు తింటే లాభాలు కలుగుతాయి ? అని చాలా మందికి సందేహాలు కూడా వస్తుంటాయి. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ విత్తనాల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విత్తనాలను తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. దీని వల్ల వ్యాధులు తగ్గుతాయి. పురుషులు ఈ విత్తనాలను తింటే వీటిలో ఉండే జింక్ వల్ల వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను పెంచుతుంది.
ఇక గుమ్మడి కాయ విత్తనాలను పురుషులు అయితే ఉదయం పరగడుపునే తింటే మంచిది. లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో అయినా సరే తినవచ్చు. ఇక మిగిలిన ఎవరైనా సరే.. సాయంత్రం వీటిని స్నాక్స్ రూపంలో తినవచ్చు. ఆ సమయంలో తినే చిరుతిళ్లకు బదులుగా గుమ్మడికాయ విత్తనాలను తింటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గుమ్మడికాయ విత్తనాలను రోజుకు గుప్పెడు మోతాదులో తినాలి. అంతకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక గుప్పెడు మోతాదులో తింటే పైన తెలిపిన ప్రయోజనాలు అన్నింటినీ పొందవచ్చు.