Malai Puri : మలైపూరీ.. మనకు స్వీట్ షాపుల్లో, రోడ్ల పక్కన బండ్ల మీద ఇది లభిస్తూ ఉంటుంది. మలై పూరీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, కమ్మగా ఉండే ఈ స్వీట్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ మలైపూరీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని తయారు చేయడం కొద్దిగా శ్రమతో, సమయంతో కూడిన పని చెప్పవచ్చు. అయితే ఎటువంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా కూడా ఈ మలైపూరీని తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మనం ఎంతో రుచిగా, అలాగే ఇన్ స్టాంట్ గా మలైపూరీని తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా మలైపూరీని తయారు చేసి తీసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా రుచిగా మలైపూరీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మలైపూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, గులాబ్ జామున్ మిక్స్ – ఒక కప్పు, చిన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
మలైపూరీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పంచదార, నీళ్లు, కుంకుమ పువ్వు వేసి వేడి చేయాలి. పందచార కరిగిన తరువాత మరో 4 నిమిషాల పాటు ఉడికించి, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టి దీనిని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో గులాబ్ జామున్ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిని గంటె జారుడుగా కలుపుకున్న తరువాత వెడల్పుగా ఉండే కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని నూనెలో ఒకే దగ్గర పూరీలాగా వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత వీటిని గంటెలోకి తీసుకుని నూనె పోయేలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని గోరు వెచ్చగా ఉన్న పంచదార పాకంలో వేసి ఒక నిమిషం పాటు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ మలైపూరీ మెత్తగా ఉండాలనుకునే వారు 3 నిమిషాల పాటు పాకంలో ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైలపూరీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.