Mango Milkshake : వేసవి తాపానికి ప్రస్తుతం అందరూ అల్లాడిపోతున్నారు. మే నెల దగ్గరికి వస్తుండడంతో ఎండలు మరీ విపరీతంగా ఉంటున్నాయి. దీంతో వేసవి తాపం నుంచి సేదదీరేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను సేవిస్తున్నారు. ఇక వేసవిలో మనకు మామిడి పండ్లు కూడా ఎక్కువగానే లభిస్తాయి. కానీ వీటిని నేరుగా తినకుండా వీటితో చల్ల చల్లని మిల్క్ షేక్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. అలాగే శరీరం కూడా చల్లబడుతుంది. ఇక మ్యాంగో మిల్క్ షేక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడి పండు గుజ్జు – ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్, పిస్తా పలుకులు – కొన్ని.
మ్యాంగో మిల్క్ షేక్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో మామిడి పండు గుజ్జు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పిస్తా పలుకులు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి మిక్సీ పట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లోకి తీసుకుని దానిపై పిస్తా పలుకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అవుతుంది. అయితే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తాగవచ్చు. దీంతో వేసవి తాపం నుంచి బయట పడతారు. శరీరం చల్లగా మారుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.