Sorakaya Ulli Karam : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. సొరకాయతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సొరకాయ ఉల్లికారం కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ వంటను ఎక్కువగా తయారు చేసే వారు. సొరకాయ ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే సొరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ ముక్కలు – 4 కప్పులు, పసుపు – అర టీ స్పూన్, శనగపప్పు – 3 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10, నూనె – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన టమాటాలు – 3, బెల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన నిమ్మకాయ – నిమ్మకాయంత, ఆవాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సొరకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా సొరకాయ ముక్కలల్లో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తరువాత ఈ ముక్కలను పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు వేసి వేయించాలి. తరువాత మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. వీటిని పొడిగా చేసి పక్కకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండు, బెల్లం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
తరువాత సొరకాయ ముక్కల్లో ఉండే నీటిని తీసేసి ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అర టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి. తరువాత సొరకాయ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ముక్కలను మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు పొడి కూడా వేసి కలపాలి. తరువాత నీళ్లు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సొరకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఉల్లికారం కూడా తయారు చేసుకుని తినవచ్చు. సొరాకయను ఇష్టపడని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు.