Masala Crispy Corn : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. స్వీట్ కార్న్ ను ఉడికించి తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ను కూడా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీ కార్న్ ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది క్రిస్పీ కార్న్ ను ఇష్టంగా తింటారు. ఈ క్రిస్పీ కార్న్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ క్రిస్పీ కార్న్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ కార్న్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – 1, కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్రిస్పీ కార్న్ మసాలా తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ గింజలను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని పూర్తిగా వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి గింజలకు పిండి పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్వీట్ కార్న్ గింజలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వీటిలో ఉప్పు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.