Masala Omelette Rolls Curry : మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో ఇది కూడా ఒకటి. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. కోడిగుడ్లతో తరుచూ చేసే వంటకాల కంటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఆవాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, టమాటాలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – 250 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన చిన్న టమాట – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన కొత్తిమీర- 1, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, కోడిగుడ్లు – 4.
మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఆమ్లెట్ తయారీ కోసం గిన్నెలో ఆమ్లెట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. తరువాత సగం ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిని మరో వైపుకు తిప్పకుండా 70 శాతం వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఆమ్లెట్ ను నెమ్మదిగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన గుడ్డు మిశ్రమంతో ఆమ్లెట్ ను వేసుకుని కాల్చి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఆమ్లెట్ ను 2 ఇంచుల ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కర్రీ తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత కొద్దిగా నీళ్లు పోసి మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత చింతపండు రసం, టమాట పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత కరివేపాకు, కొత్తిమీర, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో ముందుగా తయారు చేసుకున్న ఆమ్లెట్ రోల్స్ ను ఉంచి వాటిపై తయారు చేసుకున్న కూరను వేసుకోవాలి. దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.