Meal Maker Biryani : మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు. మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటూ ఉంటాం. మీల్ మేకర్ లలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీల్ మేకర్ లతో మనం ఎక్కువగా కూరలను తయారు చేస్తాం. కేవలం కూరలే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్ లతో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ బిర్యానీని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం – 200 గ్రా., నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 5, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – ఒకటి ముప్పావు గ్లాస్.
మసాలాదినుసులు..
బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 3, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, మరాఠీ మొగ్గ – 1, జాపత్రి – 1.
మీల్ మేకర్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మీల్ మేకర్ లను తీసుకుని వాటిపై తగినన్ని వేడి నీళ్లు పోసి ఒక నిమిషం పాటు నాననివ్వాలి. తరువాత మీల్ మేకర్ లలో ఉన్న నీటిని చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యక పచ్చిమిర్చిని, టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లగా అయిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ లను వేసి 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట మిశ్రమాన్ని కూడా వేసి కలిపి 2 నిమిషాల సాటు వేయించుకోవాలి. తరువాత తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.
తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీల్ మేకర్స్ తో చేసిన బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.