Meal Maker Pakoda : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో మీల్ మేకర్ లు కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఇతదర పోషకాలు ఉంటాయి. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేకర్ లతో కూరలు, చిరుతిళ్లు చేయడంతో పాటు వీటిని ఇతర వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ మీల్ మేకర్ లతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే మీల్ మేకర్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 2 కప్పులు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, శనగపిండి – 4 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ పేస్ట్ – పావు కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మీల్ మేకర్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని చల్లనీటిలో వేసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు మీల్ మేకర్ లల్లో ఉండే నీరు పోయేలా గట్టిగా పిండుతూ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకుని పిండి మీల్ మేకర్ లకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి మీల్ మేకర్ లను పకోడిలా వేసుకోవాలి.
తరువాత మంటను మధ్యస్థంగా చేసి అటూ ఇటూ కదుపుతూ వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పకోడా తయారవుతుంది. వీటిపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ పకోడాలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పకోడాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.