Meal Maker Pakoda : మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. మీల్ మేకర్ ను కూడా మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. మీల్ మేకర్ తో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ తో మనంచేసుకోదగిన వంటకాల్లో మీల్ మేకర్ పకోడీ కూడా ఒకటి. దీనిని తయారు చేయడం చాలా సులభమే. అలాగే మీల్ మేకర్ తో చేసే ఈ పకోడీ చాలా రుచిగా కూడా ఉంటుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే మీల్ మేకర్ లతో రుచికరమైన పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, శనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మీల్ మేకర్ పకోడీల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మీల్ మేకర్ లను తీసుకుని అందులో వేడి నీళ్లను పోయాలి. ఈ మీల్ మేకర్ లను పది నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన మీల్ మేకర్ లను చేత్తో పిండుతూ మరో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత వీటిని పది నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఇందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండిని, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీటిని వేస్తూ కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ లను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిఫ్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా అదే నూనెలో కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకుని పకోడీల మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పకోడీలు తయారవుతాయి. వీటిని నిమ్మరసం, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే పకోడీలకు బదులుగా ఇలా మీల్ మేకర్ లతో కూడా ఎంతో రుచిగా పకోడీలను చేసుకుని తినవచ్చు.