Meal Maker Tomato Masala Curry : మనం మీల్ మేకర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా గింజల నుండి తయారు చేసే ఈ మీల్ మేకర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో కూడా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మీల్ మేకర్ తో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మీల్ మేకర్ తో చేసుకోదగిన వంటకాల్లో టమాట మీల్ మూకర్ మసాలా కర్రీ ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే ఈ టమాట మీల్ మేకర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ఒక కప్పు, తరిగిన టమాటాలు – పావు కిలో, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4,గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, సాజీరా – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6.
టమాట మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్ లను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత వాటిలోని నీళ్లను పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మీల్ మేకర్ లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని అర గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు వేయించిన మీల్ మేకర్, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మీల్ మేకర్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ తో తరచూ ఒకే రకం వంటలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా మసాలా కూరలు కూడా చేసుకోవచ్చు. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.