Menthikura Pachadi : మెంతికూరను తరచూ మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెంతికూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మెంతికూరతో తరచూ చేసే వంటకాలతో పాటు మనం రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 6, పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, మెంతికూర – 2 కప్పులు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు -తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – 2 చిటికెలు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ.
మెంతికూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ దినుసులన్నీ చక్కగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో శుభ్రం చేసుకున్న మెంతికూర వేసి కలపాలి. తరువాత చింతపండు వేసి కలిపి దగ్గర పడే వరకు వేయించాలి. మెంతికూర చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన మెంతికూర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాళింపు తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది.