Methi Matar Malai : మెంతి ఆకులను సహజంగానే చాలా మంది వివిధ రకాల కూరల్లో వేస్తుంటారు. మెంతి ఆకులు చేదుగా ఉంటాయి. కనుక దీంతో నేరుగా ఎవరూ కూరలు చేయరు. కానీ కొందరు పప్పులో మాత్రం ఈ కూరను పెడుతుంటారు. అయితే మెంతి ఆకులతో ఎంతో రుచికరమైన మెంతి మటర్ మలైని తయారు చేయవచ్చు. ఇది చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి మటర్ మలై తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా మెంతికూర – ఒక కప్పు, బఠాణీలు – ఒక కప్పు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చి మిర్చి – రెండు, అల్లం వెల్లుల్లి – ఒక టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, జీడిపప్పు – ఐదు, పాలు – ఒక కప్పు, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – సరిపడా, క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు, నూనె – ఒక టేబుల్ స్పూన్.

మెంతి మటర్ మలైని తయారు చేసే విధానం..
బఠాణీలను ఉడికించి పక్కన పెట్టాలి. జీడిపప్పును కాసిని పాలలో వేసి కాసేపు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు జీడిపప్పు ముద్ద వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత మిగిలిన పాలు పోసి కలపాలి. క్రీమ్ కూడా వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు ఉడికించిన బఠాణీలు, మెంతికూర తురుము వేసి కలిపి మరిగించాలి. తరువాత సిమ్‌లో మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి దించాలి. అంతే.. రుచికరమైన మెంతి మటర్ మలై కూర రెడీ అవుతుంది. ఇది చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.