Millets Dosa : మనం రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటి వివిధ రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మను తెలిసిందే. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, కండరాలను ధృడంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా ఈ చిరు ధాన్యాలు మనకు ఉపయోగపడతాయి. ఈ చిరు ధాన్యాలతో అన్నం, సంగటి, జావ వంటి వాటినే కాకుండా వీటితో మం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. చిరు ధాన్యాలన్నింటిని కలిపి రుచిగా దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, రాగులు – అర కప్పు, సామలు – అర కప్పు, జొన్నలు – అర కప్పు, కొర్రలు – అర కప్పు, అటుకులు – అర కప్పు, మెంతులు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మిల్లెట్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో లేదా గ్రైండర్ లో వేసి తగినన్ని పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పిండి చక్కగా పులిసిన తరువాత తగినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత పిండిని వేసి దోశలా రుద్దుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత నూనె వేస్తూ చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిల్లెట్ దోశలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సాధారణ దోశలే కాకుండా ఈ పిండితో మసాలా దోశ, ఉల్లిదోశ వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. షుటర్ వ్యాధి గ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా చిరు ధాన్యాలతో దోశను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.