Minapa Pappu Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినపప్పు కూడా ఒకటి. ఇతర పప్పు దినుసుల వలె మినపప్పు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువగా తాళింపులో, అల్పాహారాల తయారీలో మినపప్పును వాడుతూ ఉంటాము. కానీ మనలో చాలా మందికి మినపప్పుతో కూడా రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చని తెలియదు. మినపప్పుతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసే వారు. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరే ఈ మినపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వేడి నీటిలో నానబెట్టిన చింతపండు- పెద్ద నిమ్మకాయంత, పొట్టు మినపప్పు – ఒక కప్పు, నూనె- ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, మెంతులు- పావు టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, పసుపు – పావు టీ స్పూన్.
మినపప్పు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మినపప్పు వేసి మాడిపోకుండా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే మినపప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి.
పచ్చడి మరీ గట్టిగా ఉండే కొన్ని కాచి చల్లార్చిన నీళ్లను పోసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడిని ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాళింపు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపప్పు పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో ఉంచకపోయినా కూడా 4 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా మినపప్పుతో రుచిగా, కమ్మగా పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.