Miriyala Rasam : భోజనంలో భాగంగా మనం వివిధ రకాల ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే అన్నంలో వివిధ రకాల కూరలను కలిపి తింటుంటాం. వాటిల్లో రసం కూడా ఒకటి. రసంను మనం అప్పుడప్పుడు మాత్రమే చేసి తింటాం. అయితే వాస్తవానికి రోజూ భోజనంలో రసాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మిరియాలతో చేసే రసాన్ని రోజూ అన్నంలో కలిపి తినాలి. దీంతో అనేక విధాలుగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక మిరియాల రసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన కంది పప్పు నీళ్లు – కప్పున్నర, చింత పండు రసం – కప్పు, పసుపు – పావు టీస్పూన్, పచ్చి మిర్చి – రెండు (ముక్కలుగా కట్ చేయాలి), ఎండు మిర్చి – నాలుగు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు – ఒక టీస్పూన్ చొప్పున, శనగపప్పు – ఒక పెద్ద టీస్పూన్, కరివేపాకు – పావు కప్పు, ఉప్పు – తగినంత.
మిరియాల రసంను తయారు చేసే విధానం..
స్టవ్ మీద గిన్నె పెట్టి చింతపండు రసం పోసి ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి ఉడికించాలి. ఆ తరువాత మరో స్టవ్ మీద పెనం పెట్టి శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని కాస్త బరకగా పొడి చేయాలి. ఈ పొడిని మరుగుతున్న చింత పండు రసంలో వేసి బాగా కలపాలి. ఇందులోనే నానబెట్టుకున్న కంది పప్పు నీళ్లు, మరికొన్ని నీళ్లను పోసి చిన్న మంటపై మరిగించాలి. మరోసారి స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి.
ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును మరుగుతున్న చారులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. మిరియాల రసం తయారవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఇలా మిరియాల రసాన్ని తయారు చేసి అన్నంలో కలిపి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.