Multi Grain Rava Upma : ఉప్మా.. మనం అల్పాహారంగా తీసుకునే పదార్థాల్లో ఇది కూడా ఒకటి. ఉప్మాను చాలా మంది అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. మనం ఎక్కువగా బొంబాయి రవ్వతో ఉప్మాను తయారు చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని సార్లు చిరు ధాన్యాల ఉప్మాను కూడా తయారు చేస్తూ ఉంటాము. అయితే ఒక్కో రకం చిరు ధాన్యాలతో కాకుండా మల్టీ గ్రెయిన్ రవ్వతో కూడా మనం ఉప్మాను తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్మా చాలారుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ మల్టీ గ్రెయిన్ రవ్వ ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీగ్రెయిన్ రవ్వ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
మల్టీగ్రెయిన్ రవ్వ – ఒక కప్పు, నూనె – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు- తగినంత, వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాట – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మల్టీగ్రెయిన్ రవ్వ ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసి వేయించాలి. ఇవి అన్నీ చక్కగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత పల్లీలు, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. ఈ రవ్వను ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మల్టీగ్రెయిన్ రవ్వ ఉప్మా తయారవుతుంది. ఈ ఉప్మాను తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ తో వ్యాధితో బాధపడే వారు ఈ ఉప్మాను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.