Munagaku Pappu : మునగ చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. మునగ చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకు వచ్చే అనేక ఆనారోగ్య సమస్యలను నయం చేయడంలో మునగాకు ఎంతో సహాయపడుతుంది. మునక్కాయలనే కాకుండా మునగాకును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మునగాకుతో మనం ఎక్కువగా కారాన్ని తయారు చేస్తూ ఉంటాం. మునగాకుతో పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే, ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రంగా కడిగిన మునగాకు – 200 గ్రా., కందిపప్పు – 100 గ్రా., తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 4, కచ్చా పచ్చగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – 30 గ్రా..
తాళింపు తయారీకి కావల్సిన పదార్తాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్.
మునగాకు పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్లను పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత పసుపు తప్ప మిగిలిన తాళింపు పదార్థాలన్నింటినీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత కచ్చా పచ్చగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మునగాకును వేసి కలిపి ఒక చిన్న గ్లాస్ మోతాదులో నీళ్లను పోసి మూత పెట్టి మునగాకును ఉడికించుకోవాలి. మునగాకు ఉడికిన తరువాత టమాట ముక్కలను, పసుపును, కారం పొడిని, చింతపండు రసాన్ని వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
5 నిమిషాల తరువాత మూత తీసి ముందుగా ఉడికించిన పప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రాగి సంగటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. మునగాకుతో ఈ విధంగా పప్పును తయారు చేసుకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయం పని తీరు మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. జీర్ణక్రియను సరిచేసే గుణం కూడా మునగాకుకు ఉంది.