Mustard Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రైస్ వెరైటీస్ రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీస్ లలో ఆవాల అన్నం కూడా ఒకటి. సాధారణంగా మనం ఆవాలను తాళింపు తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఆవాలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటల్లో వాడడంతో పాటు ఈ ఆవాలతో మనం ఎంతో రుచిగా ఉండే అన్నాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఆవాలతో రుచిగా అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాల అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, నూనె -పావు కప్పు, పసుపు, అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 లేదా కారానికి తగినన్ని, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు.
ఆవాల అన్నం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కడిగిన బియ్యం, కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత వీటిని పెద్ద మంటపై 2 విజిల్స్, చిన్న మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అన్నాన్ని పొడిగా చేసుకోవాలి. తరువాత జార్ లో ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు, కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాల పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి.
ఆవాల మిశ్రమం అన్నం పూర్తిగా కలిసిన తరువాత నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవాల అన్నం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం మిగిలినప్పుడు ఇలా ఆవాలతో ఆవాల అన్నం తయారు చేసుకుని తినవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం ల వల్ల రుచితో పాటు ఆవాల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.