Mutton Liver Fry : మాంసాహార ప్రియులందరూ చికెన్, మటన్‌లను ఎక్కువగా తింటుంటారు. కొందరికి చేపలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొందరు రొయ్యలు తింటారు. అయితే మటన్ లోనే మనకు ఇంకా వివిధ రకాల మాంసాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. తలకాయ, పాయా, భేజా, బోటి ఇలాంటివన్నమాట. ఇవే కాకుండా మటన్ లివర్ కూడా బాగానే ఉంటుంది. మటన్ కన్నా మటన్ లివర్‌తోనే మనకు పోషకాలు అధికంగా లభిస్తాయి. కనుక మటన్ తినేవారు దానికి బదులుగా లివర్‌ను తింటే మంచిది. దీంతో జింక్, విటమిన్ బి12 మనకు లభిస్తాయి. ఇవి రక్తం పెరుగుదలకు దోహదపడడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. కనుక మటన్ లివర్‌ను తరచూ తినాలి. ఇక దీన్ని ఫ్రై లాగా చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ లివర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ లివర్ – పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ – ఒకటి, టమాటా – ఒకటి, పచ్చి మిర్చి – 1, నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – సగం గ్లాస్, కొత్తిమీర తరుగు – పావు కప్పు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్.
మటన్ లివర్ ఫ్రై తయారు చేసే విధానం..
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను ముక్కలుగా తరగాలి. లివర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేయాలి. దీంట్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు, అర గ్లాస్ నీళ్లను కలిపి మూత పెట్టాలి. ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పాన్ వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. తరువాత ఉడికించిన లివర్ మిశ్రమం వేసి వేయించాలి. లివర్‌లో ఉన్న నీళ్లన్నీ అయిపోయి పొడిగా వేగిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మటన్ లివర్ ఫ్రై సిద్ధమవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో అన్నం తింటూ అందులో లివర్ ఫ్రైని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలు కూడా లభిస్తాయి.