Oats Dosa : ఉదయం సాధారణంగా అందరూ ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటారు. వాటిల్లో దోశలు కూడా ఒకటి. ఎవరైనా సరే తమకు నచ్చిన దోశలను వేసుకుని తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఓట్స్ దోశలను తిన్నారా. ఓట్స్‌ను సహజంగానే చాలా మంది పాలతో కలిపి తయారు చేసి తింటారు. కానీ ఓట్స్‌తో రుచికరమైన దోశలను కూడా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఇక ఈ దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – అర కప్పు, బియ్యం పిండి – అర కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, బొంబాయి రవ్వ – పావు కప్పు, పెరుగు – అర కప్పు, అల్లం తురుము – ఒక టీస్పూన్, పచ్చి మిర్చి తురుము – రెండు టీస్పూన్లు, మిరియాల పొడి – అర టీస్పూన్, కొత్తిమీర తురుము – రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – మూడు కప్పులు, నూనె – వేయించడానికి సరిపడా.
ఓట్స్ దోశలను తయారు చేసే విధానం..
ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత అందులో బియ్యం పిండి, రవ్వ, పెరుగు కలిపి అందులోనే జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తురుము, కొత్తిమీర తురుము, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తరువాత పెనం తీసుకుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత పిండి మిశ్రమాన్ని గరిటెతో ఒకసారి బాగా కలపాలి. అనంతరం అందులోనుంచి గరిటెతో కాస్త పిండి తీసుకుని రవ్వ దోశ లాగా వేయాలి. దీన్ని బాగా కాల్చాలి. మళ్లీ రెండో వైపుకు తిప్పి అలాగే కాల్చాలి. దీంతో రుచికరమైన ఓట్స్ దోశలు రెడీ అవుతాయి.
దోశలకు పిండి నానబెట్టేంత సమయం లేకున్నా.. త్వరగా బ్రేక్‌ఫాస్ట్ కావాలన్నా.. ఇలా ఓట్స్ దోశలను వేసి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దోశలను ఏ చట్నీతో అయినా సరే కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. ఎప్పుడూ వేసే సాధారణ దోశలకు బదులుగా ఈ సారి ఓట్స్ దోశలను ట్రై చేయండి.