Eggs : కోడిగుడ్లు అంటే సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడకబెట్టి, ఆమ్లెట్ వేసి లేదా కూర రూపంలో చేసి తింటుంటారు. అయితే కోడిగుడ్లను నిత్యం తింటే మనకు అనేక రకాల లాభాలు కలుగుతాయి. కోడిగుడ్ల వల్ల మనకు అనేక పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కోడిగుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెకు మంచిదికాదని అంటుంటారు. కానీ అందులో నిజం లేదని సైంటిస్టుల పరిశోధనలే చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.
25 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, నిత్యం ఒక కోడిగుడ్డును తినే 9734 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. వారంలో కనీసం 6 కోడిగుడ్లు తిన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గాయని, అలాగే వారిలో ఉండే ట్రై గ్లిజరైడ్ల శాతం కూడా తగ్గిందని వెల్లడైంది. అందుకని నిత్యం ఒక కోడిగుడ్డును తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
కోడిగుడ్లలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. వాటి వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగతుందని, దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయని అంటున్నారు. కనుక కోడిగుడ్లను తినాల్సిందిగా వారు సూచిస్తున్నారు. అయితే కోడిగుడ్లలో పచ్చసొనను మాత్రం అధికంగా తినరాదు. దాన్ని అధికంగా తింటే.. గుండెకు ఏమాత్రం ప్రయోజనం కలగకపోగా.. మనకు హాని కలుగుతుంది. కనుక పచ్చసొన అంతగా తినరాదు. తెల్ల సొన తింటేనే అధిక ప్రయోజనాలు కలుగుతాయి.