Oats Laddu : మనకు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒకటి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. అయితే వీటిని ఎలా తయారు చేసుకుని తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. వాస్తవానికి ఓట్స్ ను ఎలాగైనా తినవచ్చు. ఓట్స్‌తో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తింటే.. ఓవైపు పోషకాలు.. మరోవైపు శక్తి లభిస్తాయి. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఓట్స్‌తో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఓట్స్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, బాదం పప్పు – ఒక కప్పు, ఖర్జూరాలు – ఒక కప్పు, కొబ్బరి తురుము – కొద్దిగా, తేనె – 2 టీ స్పూన్లు.
ఓట్స్ లడ్డూ తయారు చేసుకునే విధానం..
మొదటగా ఓట్స్ ను లో పెనంపై 5 నిమిషాల పాటు వేయించాలి. బాదం పప్పును కూడా అదే విధంగా వేయించాలి. ఒక జార్ తీసుకుని అందులో ఓట్స్, బాదం పప్పు వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. తరువాత ఖర్జూరాలను కూడా జార్ లో వేసి తురుములా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసిన ఓట్స్, బాదం పప్పు మిశ్రమంలో ఖర్జూరాల తురుము, తేనే వేసి బాగా కలుపుకోవాలి. చేతులకు నెయ్యిని రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూలా చేసి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన ఓట్స్ లడ్డూలను ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు. అధిక బరువును తగ్గడంలో ఓట్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఈ లడ్డూలను తినడం వల్ల బాదం, ఖర్జూరాలలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి.
ఓట్స్ లడ్డూలను ఈ విధంగా తయారు చేసుకుని తినడం వల్ల ఎన్నో పోషకాలు, శక్తి లభిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వీటి తయారీలో ఉపయోగించేవి అన్నీ సహజసిద్ధమైనవే కనుక ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఈ విధంగా ఓట్స్‌ను తింటే అనేక లాభాలను పొందవచ్చు.