Onion Kachori : మనకు బయట ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో ఆనియన్ కచోరా కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఆనియన్ కచోరా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. బయట లభించే విధంగా ఉండే ఈ ఆనియన్ కచోరాను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ కచోరి తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వాము – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కిసరిపడా, సోంపు గింజలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), పసుపు – చిటికెడు, పంచదార – చిటికెడు, ఉడికించిన బంగాళాదుంప – 1, ఆమ్ చూర్ పౌడర్ – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, శనగపిండి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆనియన్ కచోరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, వాము, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత రోట్లో సోంపు గింజలు, జీలకర్ర, ధనియాలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన దినుసులను వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
ఇవి వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేసుకోవాలి. అన్నీ కలిసేలా బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ఆమ్ చూర్, గరంమసాలా, శనగపిండి వేసి కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. చివరగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మరోసారి బాగా కలుపుకుని ముద్దలుగా చేసుకోవాలి. ఈ ముద్దలన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ చేత్తో కచోరి ఆకారంలో వత్తుకోవాలి. తరువాత అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి అంచులతో మూసేసి మరలా కచోరి ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నీ కచోరీలను వత్తుకున్న తరువాత మందంగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కచోరీలను వేసి కాల్చుకోవాలి. వీటిని మొదట చిన్న మంటపై కాల్చుకుని కొద్దిగా రంగు మారిన తరువాత మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ కచోరా తయారవుతుంది. వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడి కచోరాలను చేసుకుని తింటూ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.