వేరుశెనగ పల్లీ కారం అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో పల్లీ కారం తినడానికి ఇష్టపడతారు. ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. మరి అంతే రుచికరమైన పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
వేరుశనగ పల్లీలు రెండు కప్పులు, వెల్లుల్లి ఒక గడ్డ, ఎండుమిర్చి ఒక 7, చిన్న సైజు బెల్లం ముక్క (ఇష్టముంటేనే), ఉప్పు.
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి వేరుశనగ పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.ముందుగా రుబ్బు రోలులో వేయించుకున్న ఎండు మిర్చి,రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.అందులో వేరుశనగ పల్లీలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం మెత్తగా అయిన తరువాత వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి. కొందరికీ ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లేకపోతే లేదు.ఈ విధంగా తయారైన వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.