Perugu Vankaya Kura : వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. వంకాయలను తినడం వల్ల పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ వంకాయలతో తరచూ వేపుడు, మసాలా కూర, వంకాయ టమాట వంటి కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా వంకాయలతో పెరుగు కలిపి మనం పెరుగు వంకాయ కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగు వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ కూరను రుచి చూసారంటే మరలా ఇదే కావాలని అడగక మానరు. అంత రుచిగా ఈ వంకాయ కూర ఉంటుంది. పెరుగు వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నిలువుగా తరిగిన వంకాయలు – పావు కిలో, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, పల్లీలు – పావు కప్పు, ఎండుమిర్చి – 6, పచ్చికొబ్బరి పొడి – పావు కప్పు, పెరుగు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి- ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

పెరుగు వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయముక్కలు, పచ్చి కొబ్బరి పొడి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో పెరుగును వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తరిగిన వంకాయలను వేసుకుని వేయించాలి. వీటిని కలుపుతూ పూర్తిగా వేయించాలి. వంకాయలు వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
తరువాత వేయించిన వంకాయలు, అర గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల తరువాత కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా పెరుగు వంకాయను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పెరుగు వంకాయను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.