Pesara Garelu : మనం వంటింట్లో అప్పుడప్పుడు గారెలను తయారు చేస్తూ ఉంటాం. గారెల తయారీకి ఎక్కువగా మినప పప్పును, బొబ్బెర పప్పును ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పప్పు కూరలు, చారు వంటి వాటిని తయారు చేసుకునే పెసర పప్పుతో గారెలను తయారు చేస్తూ ఉంటారు. పెసర పప్పుతో చేసే గారెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పెసర పప్పుతో గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – అర కిలో, తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, తరిగిన అల్లం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చి మిరపకాయలు – 10, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పెసర పప్పు గారెలను తయారు చేసే విధానం..
ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో నానబెట్టిన పెసర పప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండే విధంగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కచ్చా పచ్చాగా ఉండే విధంగా చేసుకుని మిక్సీ పట్టిన పెసర పప్పులో వేసి కలపాలి. దీనితో పాటుగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి అన్నా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత పెసర పప్పు మిశ్రమాన్ని గారెలుగా చేసి నూనెలో వేసి రెండు దిక్కుల ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు గారెలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా పల్లీల చట్నీలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పెసర పప్పు గారెలను ఉదయం అల్పాహారంలో లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. పెసర పప్పుతో తరచూ పప్పు కూరలు, చారు వంటి వాటినే కాకుండా ఇలా గారెలను తయారు చేసుకుని తినడం వల్ల కూడా పెసర పప్పు వల్ల కలిగే లాభాలను పొందవచ్చు. ఇతర పప్పులతో చేసిన గారెల కంటే పెసర పప్పుతో చేసిన గారెలు త్వరగా జీర్ణమవుతాయి.