Phool Makhana Masala Curry : ఫూల్ మఖనీ.. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తామర గింజల నుండి వీటిని తయారు చేస్తారు. ఫూల్ మఖనీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఫూల్ మఖనీతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో చేసే మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కూరను ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖనీతో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖనీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఫూల్ మఖనీ – ఒకటింపావు కప్పు, బిర్యానీ ఆకులు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – అర కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, చిలికిన పెరుగు – 3 టీ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, జీడిపప్పు – 10, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, లవంగాలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్.
ఫూల్ మఖనీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఫూల్ మఖనీ వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జార్ లో పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
నీళ్లు ఉడుకుపట్టిన తరువాత వేయించిన ఫూల్ మఖనా వేసి కలపాలి. వీటిని మరో 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫూల్ మఖనీ మసాలా కూర తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫూల్ మఖనీతో ఇలా రుచిగా మసాలా కూరను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.