Poornam Burelu : పూర్నం బూరెలు.. ఇవి మనందరికి తెలిసినవే. నెయ్యి వేసుకుని తింటే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పూర్ణం బూరెలు అనగానే వీటిని తయారు చేసుకోవడం మనకు తెలిసిందేగా అనుకుంటూ ఉంటారు. తరచూ చేసే పూర్ణం బూరెల కంటే కింద చెప్పిన విధంగా చేసే పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. రుచిగా, చక్కగా పైన పిండి పలుచగా ఉండేలా ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్ణం బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – అర కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, గంట పాటు నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, బెల్లం తురుము – పావు కిలో, నెయ్యి -ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పూర్ణం బూరెల తయారీ విధానం..
ముందుగా మినపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మినపప్పును జార్ లోకి తీసుకుని ఇడ్లీ పిండి పట్టుకున్నట్టు మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకుని అందులో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి ఒక గంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో శనగపప్పును, నీళ్లను పోసి మూత పెట్టి మధ్యస్ధ మంటపై 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత శనగపప్పును మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ శనగపప్పులో నీళ్లు ఉంటే నీటిని పారబోసి పప్పు చల్లగా అయిన తరువాత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో బెల్లం , ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి.
బెల్లం కరిగి నురగ వచ్చే వరకు దీనిని ఉడికించిన తరువాత మెత్తగా చేసుకున్న శనగపప్పును వేసి కలుపుకోవాలి. దీనిని నీరు అంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత నెయ్యి,యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో మిక్సీ పట్టుకున్న మినపప్పు పిండిని కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూర్ణాన్నితీసుకుని బియ్యంలో ముంచాలి. తరువాత పూర్ణాన్ని విదిలించడం వల్ల ఎక్కువగా ఉన్న పిండి అంతా పోతుంది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని నూనెలో వేసి కాల్చుకోవాలి. నూనెలో వేసిన వెంటనే వీటిని కదిలించకూడదు. పెద్ద మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన కరకరలాడుతూ లోపల మెత్తగా, రుచిగా ఉండే పూర్ణం బూరెలు తయారవుతాయి. పండుగలకు, తీపి తినాలనిపించినప్పుడు ఇలా పూర్ణం బూరెలను తయారు చేసుకుని తినవచ్చు.