Potlakaya Perugu Pachadi : మనం పెరుగును నేరుగా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. అలాగే దీనితో వివిధ రకాల పెరుగుపచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పెరుగు పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కూరలు లేనప్పుడు ఇలా పెరుగు పచ్చడి తయారు చేసుకుని అన్నమంతా తినేయవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ పెరుగు పచ్చళ్లల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా ఒకటి. పొట్టకాయతో చేసే ఈ పెరుగు పచ్చడి కమ్మగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన శరీరానికి ఎంతో మేలు చేసే పొట్లకాయలతో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, లేత పొట్టకాయ ముక్కలు – 300గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 5, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పెరుగు – అరలీటర్, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1.
పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పొట్టకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ముక్కలు వేగుతుండగానే జార్ లో పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికి మెత్తబడిన తరువాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత పెరుగును ఉండలు లేకుండా చిలకాలి. తరువాత వేయించిన పొట్టకాయముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. అన్నంతో పాటు రోటీ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది.