Teeth Damaging Foods : మన ముఖానికి చక్కటి అందాన్ని ఇవ్వడంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆహారాన్ని నమలడంలో ఇవి మనకు ఎంతో అవసరమవుతాయి. శరీరంలో ఇతర అవయవాల ఆరోగ్యంపై ఎంత శ్రద్ద తీసుకుంటామో దంతాల ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ద తీసుకోవాలి. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. దంతాలు పుచ్చిపోవడం, దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతినడం, దంతాలపై గార పట్టడం, దంతాలు సున్నితంగా మారడం వంటి వివిధ రకాల దంత సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వీటికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారాలేనని నిపుణులు చెబుతున్నారు.
మనం తీసుకునే ఆహారంలో ఉండే కెమికల్స్, ఫ్రిజర్వేటివ్స్, కలర్స్ వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వారు చెబుతున్నారు. దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలేమిటి.. అలాగే ఇవి దంతాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది పాప్ కార్న్ ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దీనిని ఒక ఆరోగ్యకరమైన చిరుతిండిగా నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే పాప్ కార్న్ లో హార్డ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. కనుక వీటిని తీసుకోవడం కూడా మంచిది కాదు. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వంటి వాటిని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. కానీ ఇవి దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. దీంతో దంతాలు క్షీణించడం, దంతాలు విరిగిపోవడం వంటివి జరుగుతాయి.
బ్లాక్ కాఫీ వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. కానీ దీనిని తాగడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయి. ఎనామిల్ కూడా దెబ్బతింటుంది. అలాగే గ్రీన్ టీ, రెడ్ వైన్ వంటివి కూడా దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఇవి మరీ అంత హానిని కలిగించనప్పటికి వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అలాగే మనలో చాలా చికెన్, మటన్ వంటి వాటిని తింటూ ఉంటారు. కొందరు ఎముకలను కూడా గట్టిగా నములుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దంతాల పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే చాలా మంది చాక్లెట్ లను, క్యాండీలను తింటూ ఉంటారు. ఇవి దంతాలకు అతుక్కుపోతూ ఉంటాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకుండానే నిద్రపోతూ ఉంటారు. దీని వల్ల దంతాలు పుచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే చిప్స్, పంచదార ఎక్కువగా కుక్కీస్ ను కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిలో ఉండే పంచదార, ఫ్రిజర్వేటివ్స్ దంతాల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఇక సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. వీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. క్రమంగా దంతక్షయం, దంతాలు సున్నితంగా మారడం వంటివి జరుగుతాయి. అలాగే ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో దంత క్షయం, నోటిలో ఇన్పెక్షన్ లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాన్ ను కూడా చాలా మందితింటూ ఉంటారు. పాన్ ను తీసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. దంతాల రంగు మారుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలు దంతాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కనుక వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.