Prawns Pakoda Recipe : నాన్‌వెజ్ అంటే ఇష్టపడే వారిలో చాలా మంది రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. రొయ్యలు చాలా ఉత్తమమైన పోషకాహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఇతర మాంసాహారాల కన్నా అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అలాగే మినరల్స్ కూడా ఎక్కువే. కనుక రొయ్యలను తింటే మనం అన్ని రకాల పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే రొయ్యలతో రెగ్యులర్‌గా చేసే కూరను కాకుండా వాటితో ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల పకోడీలను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – 12, శనగ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మైదా – ఒక టీస్పూన్, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, నిమ్మరసం – ఒకటిన్నర టీస్పూన్, చాట్ మసాలా, కారం, ధనియాల పొడి – ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
రొయ్యల పకోడీలను తయారు చేసే విధానం..
రొయ్యలను శుభ్రం చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అవి పూర్తిగా తడారిపోయాక ఒక టీస్పూన్ నూనె, మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ కలపాలి. స్టవ్ పైన బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోసి అది కాగాక రొయ్యల్ని రెండేసి చొప్పున అందులో వేసి వేయించి తీయాలి. ఇలా అన్ని రొయ్యలను పకోడీల్లా వేయించాలి. తరువాత వాటిని టిష్యూ ఉంచిన ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎక్కువగా ఉండే నూనె టిష్యూలలోకి వెళ్లిపోతుంది. దీంతో రుచికరమైన రొయ్యల పకోడీలు తయారవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా సాస్‌తో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. వెరైటీగా ఇలా చేస్తే అందరికీ నచ్చుతాయి.