Ragi Cookies : పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వాటిలో కుక్కీస్ కూడా ఒకటి. మనకు మార్కెట్ లో, బేకరీలలో రకరకాల కుక్కీస్ లభిస్తూ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కుక్కీస్ ను ఇష్టంగా తింటారు. అయితే ఈ కుక్కీస్ ను మైదాపిండితో తయారు చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. మైదాపిండితో చేసిన ఈ కుక్కీస్ రుచిగా ఉన్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. కనుక వీటికి బదులుగా ఓట్స్, రాగిపిండితో హెల్తీ కుక్కీస్ ను తయారు చేసుకుని తినడం మేలు.
బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు, పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అలాగే వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ హెల్తీ కుక్కీస్ ను తయారు చేయడం చాలా సులభం. ఒవెన్ లేకపోయినా కూడా ఈ కుక్కీస్ ను మనం తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ హెల్తీ కుక్కీస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ కుక్కీస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – అర కప్పు, ప్లేన్ ఓట్స్ – అర కప్పు, ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పటిక బెల్లం పొడి – 3 టీ స్పూన్స్ లేదా తగినంత, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – 3 టేబుల్ స్పూన్స్.
హెల్తీ కుక్కీస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత ఓట్స్, ఉప్పు, యాలకుల పొడి, పటిక బెల్లం, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత నూనె వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత పాలు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద పిండిని ఉంచి ముందుగా చేత్తో వత్తుకోవాలి. తరువాత దీనిపై మరో ప్లాస్టిక్ కవర్ ను ఉంచి చపాతీ కర్రతో వత్తుకోవాలి. తరువాత అంచులు పదునుగా ఉండే గిన్నెతో లేదా కుక్కీ కట్టర్ తో కుక్కీస్ ను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కుక్కీస్ ను నూనె రాసిన ప్లేట్ మీద వేసుకోవాలి.
మిగిలిన పిండిని కూడా మళ్లీ వత్తుకుని కుక్కీస్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కీ ప్లేట్ ను ఫ్రీహీట్ చేసుకున్న కళాయిలో ఉంచి మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తరువాత కుక్కీస్ ను మరో వైపుకు తిప్పి మరలా మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కుక్కీస్ ను పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని గాజు జార్ లో వేసుకుని గాలి తగలకుండా మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ కుక్కీస్ తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.