Ragi Roti : రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా రాగులు మనకు మేలు చేస్తాయి. రాగులతో ఎక్కువగా రొట్టెలను కూడా తయారు చేస్తూ ఉంటారు. రాగి రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ రొట్టెలను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. మరింత రుచిగా, కమ్మగా, ఆరోగ్యానికి మేలు చేసేలా రాగి రోటీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – తగినన్ని.
రాగి రోటి తయారీ విధానం..
ముందుగా కళాయిలో రాగిపిండి వేసి వేయించాలి. దీనిని కలుపుతూ 3 నిమిషాల పాటు వేయించిన తరువాత గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత వీటిని కూడా పిండిలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి.
తరువాత కొద్దిగా పిండిని తీసుకుని బటర్ పేపర్ మీద వేసి చేతులకు నూనె రాసుకుంటూ రొట్టెలాగా వత్తుకోవాలి. తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కాల్చుకున్న తరువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టెలు తయారవుతాయి. వీటిని నేరుగా తిన్నా లేదా ఏదైనా కర్రీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా రాగిపిండితో రొట్టెలు తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.