Rajma Palak Masala : మనదేశంలో ఉత్తరాది వారు ఎక్కువగా తినే ఆహార పదార్థాల్లో రాజ్మా గింజల గురించి ముందుగా చెప్పుకోవాలి. వీటినే ఇంగ్లీష్ లో కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎరుపు, తెలుపు లేదా రెండూ కలిసిన రంగులో దొరుకుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు రాజ్మాలో పుష్కలంగా ఉంటాయి. రాజ్మా మసాల పేరుతో కర్రీ ఇంకా రాజ్మా చావల్ పేరుతో అన్నం తో కలిపి తింటూ ఉంటారు. కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకునే వారు రాజ్మాతో పాలకూర ను కలిపి రాజ్మా పాలక్ మసాలను తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్మా పాలక్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..
రాజ్మా – 1 కప్పు, నూనె – 2 స్పూన్లు, బిర్యానీ ఆకులు- 2, యాలకులు- 2, ఉల్లిపాయ ముక్కలు- 1 కప్పు, పచ్చిమిర్చి- 2, అల్లం పేస్టు- 2 స్పూన్లు, వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్, టమాట గుజ్జు- అర కప్పు, ధనియాల పొడి- 1 స్పూన్, పసుపు- అర స్పూన్, కారం – 2 స్పూన్లు, గరం మసాల- 1 స్పూన్, పాలకూర తరుగు- 2 కప్పులు, కసూరీ మేథీ- 1 స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం- 2 స్పూన్లు, క్రీమ్- 2 స్పూన్లు.
రాజ్మా పాలక్ మసాలాను తయారు చేసే విధానం..
రాజ్మా ను ముందురోజే రాత్రంతా నానబెట్టుకోవాలి. ముందుగా స్టౌ పైన కుక్కర్ ను పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తరువాత దానిలో బిర్యానీ ఆకులు, యాలకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాట గుజ్జు, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ వేగిన తరువాత నానబెట్టుకున్న రాజ్మా వేసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆవిరి పోయిన తరువాత కుక్కర్ మూత తీసి మళ్లీ పొయ్యి వెలిగించుకోవాలి. ఇప్పుడు దానిలో పాలకూర తరుగు, కసూరీమేథీ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాలకూర ఉడికిన తరువాత క్రీమ్ వేసుకొని కుక్కర్ ను స్టౌ మీద నుండి దించుకోవాలి. దీనిలో రాజ్మా ఇంకా పాలకూరలో ఉండే పోషకాలతోపాటు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.