Rashmika Mandanna : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు అనేక మాధ్యమాల్లో ఖాతాలను ప్రారంభిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లతోపాటు యూట్యూబ్‌లోనూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు యూట్యూబ్‌లో సొంత చానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక వారి జాబితాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా చేరిపోయింది. ఈమె సొంతంగా యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అందులో ఆమె పలు వీడియోలను కూడా అప్‌లోడ్ చేసింది.

తెలుగు తెరకు రష్మిక మందన్న ఛలో అనే సినిమా ద్వారా పరిచయం అయింది. తరువాత ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ముఖ్యంగా గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు.. బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తరువాత ఈమె నటించిన పుష్ప సినిమాతో ఈమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పలు బాలీవుడ్ సినిమాల్లోనూ రష్మిక మందన్న నటిస్తోంది. ఇక తాజాగా యూట్యూబ్‌లో సొంత చానల్‌ను ఓపెన్ చేయడంతో ఈమె ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది.
యూట్యూబ్‌లో సొంత చానల్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా రష్మిక మందన్న తన మొదటి వీడియోను అందులో అప్‌లోడ్ చేసింది. ఇందులో తన వ్యక్తిగత, సినిమా పరమైన అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది. తనకు విహార యాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టమని, నటన అన్నా, డ్యాన్స్ చేయడం అన్నా.. చాలా ఇష్టమని తెలియజేసింది. అలాగే కొందరు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా ఈమె సమాధానాలు చెప్పింది. కానీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగిన ప్రశ్నలకు మాత్రం ఈమె బదులివ్వలేదు. ఆ విషయాలను చెప్పలేనని ముందే స్పష్టం చేసింది.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే ఈమె సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అలాగే థాంక్ యూ అనే మరో బాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఇందులో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు త్వరలో ఈమె పుష్ప 2 సినిమాలోనూ నటించనుంది.