Rasmalai : కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు ఒకటి. పాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. పాలతో మనం వివిధ రకాల పాల పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే తీపి పదార్థాలలో రస్ మలై కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. దీనిని ఇంట్లో కూడా మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రస్ మలై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రస్ మలై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – ఒక లీటర్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 3 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పుడ్ కలర్ – చిటికెడు, జీడి పప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, బాదం పలుకులు – ఒక టేబుల్ స్పూన్, పిస్తా పలుకులు – ఒక టేబుల్ స్పూన్.
రస్ మలై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అర లీటర్ పాలను పోసి బాగా వేడి చేయాలి. పాలు కాగిన తరువాత నిమ్మరసం వేసి బాగా కలపాలి. పాలు విరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు అన్ని పోయేలా వడకట్టుకోవాలి. పాల విరుగుడును మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగి ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టి మిగిలిన నీళ్లు అన్ని పోయేలా బరువును ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో పాలను పోసి కలుపుతూ బాగా మరిగించాలి. పాలు మరుగుతుండగానే మరో గిన్నెలో ఒకటింపావు కప్పు పంచదారను వేసి నీళ్లను పోసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పడు ముందుగా మూట కట్టి ఉంచిన పాల విరుగుడును ఒక గిన్నెలోకి తీసుకుని చపాతీ పిండిలా ఉండలు లేకుండా బాగా కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకుని చేత్తో కొద్దిగా వత్తి పంచదార నీటిలో వేసి మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు మరుగుతున్న పాలలో మిగిలిన పంచదార వేసి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి, ఫుడ్ కలర్, జీడి పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ముందుగా పంచదార నీటిలో ఉడికించుకున్న పాల విరుగుడు ముద్దలను వేసి మూత పెట్టి 3 నుండి 4 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టిన తరువాత చిన్న గిన్నెలోకి తీసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రస్ మలై తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితోపాటు పోషకాలను పొందవచ్చు.