Rava Balls : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో రవ్వ బాల్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఇవి చక్కగా ఉంటాయి. తరచూ ఈ అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఈ రవ్వ బాల్స్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, పెరుగు – అర కప్పు.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్న ముక్కలుగా తరిగిన క్యాప్సికం – 1, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన టమాట – 1, కారం – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఉడికించిన బంగాళాదుంపలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, నువ్వులు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుకొబ్బరి పొడి – ఒక టీ స్పూన్,కారం – చిటికెడు, ఉప్పు – చిటికెడు.
రవ్వ బాల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత పెరుగును వేసి కలపాలి. అవసరమైతే రెండు టీ స్పూన్ల నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, క్యారెట్, క్యాప్సికం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. బంగాళాదుంపలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు ఉంచాలి. బంగాళాదుంప మిశ్రమం చల్లారిన తరువాత కొద్ది కొద్ది తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత రవ్వ మిశ్రమాన్ని తీసుకుని మరోసారి బాగా కలపాలి.
తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ చెక్క అప్పలాగా వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత దాని మధ్యలో బంగాళాదుంప ఉండను ఉంచి అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకుని ఆవిరి 1మీద 15 నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఒక్కో పదార్థాన్నీ వేసుకుంటూ తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఉడికించిన రవ్వ ఉండలను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ తయారవుతాయి. వీటిని ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తయారు చేసుకుని తినవచ్చు. రవ్వతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.