Rava Gulab Jamun : రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా తయారు చేసుకోగలిగే తీపి వంటకాల్లో గులాబ్ జామున్ లు కూడా ఒకటి. గులాబ్ జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గులాబ్ జామున్ లను మనం ఎక్కువగా బయట లభించే గులాబ్ జామున్ మిక్స్ తో తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఎటువంటి గులాబ్ జామున్ మిక్స్ లేకున్నా మనం చాలా సులభంగా రవ్వతో గులాబ్ జామున్ లను తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసే ఈ గులాబ్ జామున్ లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ గులాబ్ జామున్ లను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – 3 కప్పులు, పంచదార – 2 కప్పులు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నెయ్యి – ఒక టీ స్పూన్.
రవ్వ గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదార, 3 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి జిగురుగా అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ చక్కగా వేగిన తరువాత దీనిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి, పాలు, పాల పొడి వేసి కలపాలి. పాలు మరిగిన తరువాత వేయించిన రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ రవ్వను కళాయికి అంటుకోకుండా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత తగినంత పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ జామున్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి వెంటనే పాకంలో వేసుకోవాలి. వీటిని ఒక గంట పాటు నానబెట్టుకున్న తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ గులాబ్ జామున్ లు తయారవుతాయి. తీసి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ్వ గులాబ్ జామున్ లను తయారు చేసుకుని తినవచ్చు.