Ravva Prasadam Burelu : మనం బొంబాయి రవ్వతో వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ బూరెలు కూడా ఒకటి. రవ్వ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. ప్రసాదంగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. రవ్వ బూరెలను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మళ్లీ ఇవే కావాలని కోరుతూ ఉంటారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ రవ్వ బూరెలను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – అర కప్పు, బియ్యం – ఒక కప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార – ఒక టీ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు,యాలకుల పొడి – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ బూరెల తయారీ విధానం..
ముందుగా మినపప్పును, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గంటల పాటునానబెట్టాలి. తరువాత బియ్యాన్ని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార, ఉప్పు వేసి పక్కకు ఉంచాలి. పిండి మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు, బెల్లం తురుము వేసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరుగుతుండగానే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. రవ్వను 4 నిమిషాల పాటు వేయించిన తరువాత బెల్లం నీటిని పోస్తూ కలపాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న పిండిలో వంటసోడా వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బూరెలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వ బూరెలను తయారు చేసి తీసుకోవచ్చు.