Raw Cashew Nuts Masala Curry : మనం జీడిపప్పుతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జీడిపప్పు వేసి చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే మనం సాధారణంగా ఎండిన జీడిపప్పును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంటల్లో కూడా దీనినే ఉపయోగిస్తాము. ఎండిన జీడిపప్పుతోనే కాకుండా పచ్చిజీడిపప్పుతో కూడా మనం రుచికరమైన మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. పచ్చి జీడికాయలు మనకు వేసవికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ జీడికాయల నుండి సేకరించిన పచ్చి జీడిపప్పుతో చేసే ఈ మసాలా కూర చాలారుచిగా ఉంటుంది. దేనితో తిన్నడానికైనా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. పచ్చి జీడిపప్పుతో రుచికరమైన మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి జీడిపప్పు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిజీడిపప్పు – ఒక కప్పు, ఎండు జీడిపప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – 2 టీ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్స్, ఉడికించిన టమాటాలు – 4, ఉప్పు -తగినంత, నూనె – 4 టీ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు -ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

పచ్చి జీడిపప్పు మసాలా కూర తయారీ విధానం..
ముందుగా పచ్చి జీడిపప్పును గిన్నెలోకి తీసుకుని వేడి నీటిని పోయాలి. వీటిని కొద్ది సేపు ఇలాగే ఉంచి ఆ తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో జీడిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇదే జార్ లో టమాటాలపై ఉండే తొక్కను తీసేసి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం వేసి కలపాలి.
ఇప్పుడు పచ్చి జీడిపప్పు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మూత పెట్టి మగ్గించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి జీడిపప్పును సగానికి పైగా ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, పులావ్, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.