Rice Dosa : రోజూ ఉదయం చాలా మంది రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటారు. ఉదయం చేసే టిఫిన్లలో ఇడ్లీలు, దోశలు, పూరీలు వంటివి ఎక్కువగా ఉంటాయి. బయట బండ్లు లేదా హోటల్స్‌లోనూ ఇవే రకాల టిఫిన్లు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే టిఫిన్లను చేయాలంటే ముందు రోజే పిండి రుబ్బి పెట్టి ఉంచాలి. కానీ మిగిలిపోయిన అన్నంతోనూ టిఫిన్ తయారు చేయవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉండే దోశలను వేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మిగిలిపోయిన అన్నంతో దోశలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు, గోధుమ పిండి – అర కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, మంచినీళ్లు – ఒకటిన్నర కప్పు, పెరుగు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కుకింగ్ సోడా – చిటికెడు, నూనె – తగినంత.
అన్నం దోశలను తయారు చేసే విధానం..
మిక్సీలో అన్నం, గోధుమ పిండి, బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత సుమారు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత అవసరం అయితే కొంచెం కొంచెంగా మరో ఒకటిన్నర కప్పుల నీళ్లను పోసి కలపాలి. ఇప్పుడు పెరుగు కూడా వేసి కలపాలి. ఉప్పు, వంట సోడా వేసి అవసరమైతే మరికాసిన్ని నీళ్లను పోసి కలిపి కాగిన పెనం మీద దోశలా వేసి రెండు వైపులా బాగా కాల్చి తీయాలి. ఇలా మిగిలిపోయిన అన్నంతో దోశలను వేసుకోవచ్చు. వీటికోసం ముందు రోజు పిండి రెడీ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే వీటిని వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఇలా చేసిన దోశలను కొబ్బరి లేదా పల్లి చట్నీతో తింటే సూపర్‌గా ఉంటాయి.