Rice Pakora : పకోడీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు తింటుంటే వచ్చే మజాయే వేరు. అందులో భాగంగానే వివిధ రకాలుగా పకోడీలను వేసుకుని తింటుంటారు. షాపుల్లోనూ పకోడీలు లభిస్తాయి. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోనూ మనం పకోడీలను వేసుకోవచ్చు. ఇవి కూడా షాపుల్లో లభించే మాదిరిగా రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర – 1 టీస్పూన్, అల్లం పేస్ట్ – 1 టీస్పూన్, శనగపిండి – 4 టీస్పూన్లు, బియ్యం పిండి – 2 టీస్పూన్లు, కొత్తిమీర – 1 కట్ట, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
అన్నం పకోడీలను తయారు చేసే విధానం..
ముందుగా మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం పేస్ట్, తరిగిన పచ్చి మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె పోసి వేడి అయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పకోడీలలా వేసుకోవాలి. సాయంత్రం వేళ వేడి వేడి స్నాక్స్‌గా ఈ పకోడీలను సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఇకపై అన్నం మిగిలితే పడేయకుండా ఎంచక్కా దాంతో పకోడీలను ఇలా చేసుకోండి. అందరూ ఇష్టపడతారు.