Shanagala Dosa : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పప్పు దినుసుల్లో శనగలు కూడా ఒకటి. శనగల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. శనగలతో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. శనగలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంటకాలతో పాటు ఈ శనగలతో మనం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగల దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. సులభంగా, రుచిగా శనగలతో దోశలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల శనగలు – ఒక కప్పు, బియ్యం – అర కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
శనగల దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. అలాగే బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు, బియ్యం నానిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి దోశపిండిలా కలుపుకోవాలి. ఇందులోనే ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి రుద్దాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఈ దోశను నూనె వేస్తూ రెండు వేపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల దోశ తయారవుతుంది. ఈ దోశపై ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిదోశలాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న దోశను ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. శనగలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.