Soft Mysore Pak : శనగపిండితో మనం రకరకాల పిండి వంటకాలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో సాప్ట్ మైసూర్ పాక్ కూడా ఒకటి. ఈ మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా ఉంటుంది. మనకు స్వీట్ షాపుల్లో ఈ మైసూర్ పాక్ చాలా సులభంగా లభిస్తూ ఉంటుంది. బయట కొనుగోలు చేసే అవసరం లేకుండా ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఈ సాప్ట్ మైసూర్ పాక్ ను వంటరాని వారు కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఈ మైసూర్ పాక్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాప్ట్ మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, కరిగించిన నెయ్యి – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు.
సాప్ట్ మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపిండి వేసి చిన్న మంటపై వేయించాలి. పిండి కొద్దిగా రంగు మారే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు నెయ్యి పోసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార తీగపాకం రాగానే మంటను చిన్నగా చేసి ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. శనగపిండి అంతా నెయ్యిని పీల్చుకున్న తరువాత మరికొద్దిగా నెయ్యి వేసి కలపాలి. ఇలా మిగిలిన నెయ్యిని వేసుకుంటూ ఉడికించాలి. కొద్ది సమయానికి పీల్చుకున్న నెయ్యిని శనగపిండి కొద్ది కొద్దిగా వదలుతూ ఉంటుంది.
ఇలాంటి సమయంలో కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. శనగపిండి ఉండ చుట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసిన గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని వేరే ప్లేట్ లోకి తీసుకుని మనకు కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా సాప్ట్ మైసూర్ పాక్ ను తయారు చేసుకుని తినవచ్చు.