Sorakaya Halwa : సొరకాయను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సొరకాయతో పప్పు, పచ్చడి, కూర వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా సొరకాయతో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. సొరకాయతో రుచికరమైన హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ తురుము – 4 కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన చిక్కటి పాలు – ఒక కప్పు, పంచదార – పావుకిలో, పాలపొడి – 3 టేబుల్ స్పూన్స్, ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
సొరకాయ హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నెయ్యిలో సొరకాయ తురుము వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పాలు పోసి కలపాలి. దీనిని 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత పాలపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఫుడ్ కలర్ వేసి కలపాలి.
దీనిని హల్వా లాగా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ హల్వా తయారవుతుంది. ఈ హల్వా తయారు చేసేటప్పుడు సొరకాయ లోపల ఉండే గింజలను, తెల్లటి భాగాన్ని తీసేసి సొరకాయను తురుముకోవాలి. ఈ విధంగా సొరకాయతో చేసిన హల్వాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ కూరలే కాకుండా సొరకాయతో ఇలా రుచికరమైన హల్వాను కూడా తయారు చేసి తీసుకోవచ్చు.