Pineapple Chaat : పైనాపిల్ చాట్.. పైనాపిల్ తో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పండ్లు తినడం ఇష్టపడని పిల్లలకు ఇలా వాటితో చాట్ ను తయారు చేసి పెట్టవచ్చు. ఈ చాట్ ను తయారు చేయడం చాలా సులభం. 5 నిమిషాల్లో ఈ చాట్ ను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పైనాపిల్ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కీరదోస తరుగు – అర కప్పు, ఉడికించిన ఆలూ తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట – 1, క్యారెట్ తురుము – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా, గరం మసాలా – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, మరమరాలు – 50 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వేయించిన పల్లీలు – గుప్పెడు.
పైనాపిల్ చాట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ చాట్ తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచిన తరువాత కూడా తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఇలా రాత్రి సమయంలో భోజనానికి బదులుగా ఇలా పైనాపిల్ తో చాట్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.